ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తొలిమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ఇప్పడు తెలంగాణ రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేసిన ఘనత తుమ్మలకే దక్కుతుంది. ఈయన దాదాపుగా 16 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఈయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లలో పలు కీలక శాఖలు నిర్వహించారు. తుమ్మల ప్రస్తుతం కేసీఆర్‌ సారథ్యంలో రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
 
2014 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసి తుమ్మల పరాజయం పొందారు. కానీ, సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు.. ఆయనతో ఉన్న మిత్రత్వంతో తుమ్మల టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత తుమ్మలకు శాసనసభ సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ సీటు దక్కింది. కానీ, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి చెందడంతో ఏర్పడిన ఖాళీలో తుమ్మల పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఈయన రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 
ప్రస్తుతం పాలేరు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న తుమ్మల నియోజకవర్గంలో అపర భగీరథునిగా అభివృద్ది పథకాలను ముందుకు నడిపిస్తున్నారు. కరువు ప్రాంతమైన పాలేరులో, తిరుమలాయపాలెం మండలంలో సుమారు రూ. 350 కోట్ల వ్యయంతో భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మించారు. రూ. 7,500 కోట్లతో  సుమారు 10లక్షల ఎకరాలకు సాగునీరందించే సీతారామ ప్రాజెక్టు తుమ్మల చిరకాల స్వప్నం.
 
నియోజకవర్గంలోని అన్నిగ్రామాలలో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా నీరు పారించి చెరువులు నింపడం ద్వారా సాగునీటి సమస్యను తీర్చారాయన. సుమారు 70వేల ఎకరాలకు భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి నీరందుతుంది. అదేవిధంగా గ్రామాలను, తండాలను కలుపుతూ బీటీ రహదారులు మంజూరు చేయించి, వాటిని నిర్మించారు. పాలేరు జలాశయం వద్ద మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇదిపూర్తయితే ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్య కూడా తీరుతుంది. సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులు కూడా నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నాయి.
 
భద్రాచలం ఆలయ అభివృద్ధికి సుమారు రూ. 300కోట్లతో ప్రణాళిక రూపొందించారు. తుమ్మల చొరవతో పలు సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పవర్‌ ప్రాజెక్టులు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తుమ్మల అన్ని విధాల కృషి చేస్తున్నారు.
 
ఈసారి ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తుమ్మలనే అధిష్ఠానం ప్రకటించింది. దీంతో గతేడాది కంటే ఈసారి ఎన్నికల్లో మరింత భారీ మెజారిటీతో గెలవాలని తుమ్మల నాగేశ్వర రావు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్లు జిల్లా కేడర్ మొత్తాన్ని కలుపుకొని పోతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 
ADVT

ADVT
2014 ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం: గండుగులపల్లిలో ఇల్లు, హైదరాబాద్‌లో ఇల్లు, దమ్మపేట మండలం లింగాలపల్లిలో 30ఎకరాలపొలం, బ్యాంకులో సుమారు రూ.10 లక్షల అప్పు, రెండు లక్షల నిల్వ, భార్య పేరు మీద సుమారు రూ.5లక్షల విలువైన బంగారం, కార్లు ఉన్నాయి. మొత్తంగా రూ. 2కోట్ల 92లక్షల 50వేల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో ధాఖలు చేశారు.
రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా రాబట్టగల సమర్ధుడిగా తుమ్మలకు పేరుంది. పాలనాపరంగా ఆయన ఎంత బిజీగా ఉన్నా.. వ్యవసాయంపై దృష్టి సారిస్తునే ఉంటారు. నిత్యం తన వ్యవసాయక్షేత్రాలకు వెళ్తుంటారు.
 
ఆయన కోయబాషను కూడా అనర్గళంగా మాట్లాడుతూ గిరిజనులను సైతం ఆశ్చర్యపరుస్తుంటారు. 60ఏళ్లకోసారి భద్రాచలంలో జరిగే  శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని నాడు మంత్రిగా తుమ్మల నిర్వహించారు. అలాగే 12ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు కూడా తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడే రావడంతో వాటిని కూడా ఆయన భద్రాచలంలో ఘనంగా నిర్వహించారు.
 
మంత్రి తుమ్మలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న వేలాది మంది నాయకులు, కార్యకర్తలను సైతం పేరుపెట్టి పిలిచేంత జ్ఞాపక శక్తి ఆయన సొంతం.
 
సరదాగా ఉన్నప్పుడు పరిచయస్తులు, స్నేహితులతో  గ్రామాల్లో తిట్టుకునే బూతులను జోకులుగా పేలుస్తారు. అలాగే ఏదైనా విషయం ఉన్నప్పుడు నాయకులు, కార్యకర్తలకు సైతం కన్నుకొట్టి మరీ ఛలోక్తులు విసురుతారు. పక్కన ఉన్న వ్యక్తుల భుజంపై చేయి వేసి మాట్లాడడం ఆయనకు హాబీ.
 
తన గ్రామానికి ఎవరైనా ముఖ్యులు వస్తే వారికి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయించి, తానే స్వయంగా వడ్డించే విలక్షణమైన వ్యక్తిత్వం గల వ్యక్తి తుమ్మల.