మక్తల్
ఆస‌క్తిక‌ర అంశాలు
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లారెడ్డిపై 10,027 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  కొంతకాలం తరువాత ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ నుంచే పోటీచేయనున్నారు. టికెట్ కూడా ఆయనకే కేటాయించారు. ఆయన కాంగ్రెస్‌ను వీడడంతో పార్టీ కొంత బలహీనపడింది. అయితే వచ్చే ఎన్నికల్లో మహాకూటమి నుంచి ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొనడంతో బరిలో దిగబోయేది టీడీపీ అభ్యర్థేనని స్పష్టత వచ్చింది. టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మద్దతు కూడా దయాకర్‌కు ఉండటంతో టీఆర్ఎస్‌కు నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి బి. కొండయ్య ఈసారి బరిలో నిలవనున్నారు. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలోనే ఆయన చోటు దక్కించుకున్నారు.

ADVT
మొత్తం ఓటర్లు: 2,06,909
పురుషులు:  1,02,559
స్త్రీలు: 1,04,331
ఇతరులు: 19
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
మక్తల్‌ నియోజకవర్గంలో ముదిరాజ్‌ బీసీ ఓటు బ్యాంకు అధికంగా ఉండడంతో బీసీ నినాదం కొంతమేర ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ఎస్సీలు కూడా కొంతమేర ఎన్నికల్లో ప్రభావం చేసే అవకాశముంది.
నియోజకవర్గంలో ప్రధానంగా సంగంబండ, భూత్పూర్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కాల్వల ద్వారా సాగు చేస్తున్నారు. భూత్పూర్‌ ముంపు గ్రామంగా ప్రకటించినా నేటికీ నష్ట పరిహారం చెల్లించలేదు. మాగనూర్‌, కృష్ణ గ్రామ సరిహద్దుల నుంచి కృష్ణా, భీమా నదులు పారుతుండగా పరిసర గ్రామ రైతులు నదినీటితో పాటు ఎత్తిపోతల ద్వారా పంటలను సాగు చేస్తున్నారు. సంగంబండ నీటితో నర్వ, మక్తల్‌ మండలంలోని పలు చెరువులను నింపి సాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.