వనపర్తి
ఆస‌క్తిక‌ర అంశాలు
వనపర్తి నియోజకవర్గంలో మొదటి నుంచి త్రిముఖ పోటీనే ఉంటూ వస్తోంది. మూడు ప్రధాన పార్టీల నుంచి రాష్ట్రస్థాయిలోని కీలకనేతలు ఇక్కడి బరిలో నిలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా మరోమారు తన విజయాన్ని పరీక్షించుకోనున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గత ఎన్నికల్లో చిన్నారెడ్డిపై ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మరోసారి పోటీచేయనున్న ఆయన టీఆర్ఎస్ అమలుచేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గులాబీ జెండాను ఎగురవేసేందుకు కష్టపడుతున్నారు. ఇక గత ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రి చిన్నారెడ్డి  కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకుతో పాటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ఉన్న అసంతృప్తి తనకు కలిసివస్తుందని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో రన్నరప్‌గా నిలిచిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న నిరంజన్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలు, వనపర్తికి నీళ్లు తెచ్చామనే పేరుతో ఈసారి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. 

ADVT
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 2,21,418
పురుషులు: 1,11,749
స్త్రీలు: 1,09,643
ఇతరులు: 26
నియోజకవర్గం పరిధిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. అయితే కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల పథకాలతో పాటు జూరాల ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి నీరందుతుంది. ముఖ్యమైన సంస్థలు లేవు. ఒక ప్రైవేటు షుగర్‌ ఫ్యాక్టరీ, ఏడీబీ లిక్కర్‌ కంపెనీలు ఉన్నాయి.
రావుల చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్నారు. గతంలో చంద్రబాబు నేతృత్వంలో చీప్‌విప్‌గా పనిచేయడంతోపాటు రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పనిచేశారు. టీడీపీలో కీలకనేతగా ఉన్న రావులకు వనపర్తిలో ప్రత్యేక ఓటుబ్యాంకు ఉంది.
అలాగే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి నియోజవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
ప్రస్తుతం టీఆర్‌ఎస్ తరపున పోటీ చేయనున్న నిరంజన్ రెడ్డి.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరుండటంతోపాటు నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
తమిళనాడులోని శ్రీరంగంలోని పద్మనాభ స్వామి ఆకారంలో నిర్మించిన శ్రీరంగాపురం రంగనాయకస్వామి దేవాలయం పర్యాటకులను ఆకర్షిస్తోంది. అలాగే వనపర్తి రాజావారి సంస్థానానికి గుర్తుగా రాజప్రసాదం ఉంది. అందులో ప్రస్తుతం పాలిటెక్నిక్‌ కళాశాలను నడుపుతున్నారు. ఖిల్లాఘనపురంలోని ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ ట్రెక్కింగ్‌ చేసే విధంగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.